కలం, కుంటాల: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి వృథాను అరికట్టి, నీటి లీకేజీలను వెంటనే సరిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్(Srinivas) సూచించారు. శుక్రవారం కుంటాల మండలం ఓల గ్రామంలో ఆయన పర్యటించి పారిశుధ్య నిర్వహణ, మిషన్ భగీరథ నీటి సరఫరా, లీకేజీ ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి, కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా పైపులైన్ల లీకేజీలు ఉంటే వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు సైతం నీటిని వృథా చేయకుండా బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్ట రవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

