కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఖనిజ సంపదను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) దృష్టి సారించారు. ఈ మేరకుఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ (APMDC)ని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన క్యాంపు ఆఫీస్ లో మైనింగ్ శాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, వినియోగం తదితర అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.
ఖనిజ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏపీ రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APREDC) ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఏపీఎండీసీని లిస్ట్ చేసేందుకు వచ్చే ఏడాది డిసెంబర్ లక్ష్యంగా ఐపీఓ కార్యాచరణ చేపట్టారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువను రూ.86,290 కోట్లుగా.. ఖనిజ వనరుల విలువను సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఖనిజ వనరులను కేవలం ఆదాయం చూడటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ ఆస్తిగా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

