84 విద్యుత్ మోటార్లు చోరీ.. చివ‌రికి ఇలా చిక్కారు

కలం, వరంగల్: వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లను అపహరిస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు (Narsampet Police) గురువారం పట్టుకున్నారు. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18.44 లక్షల విలువైన 84 మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజుపేట క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు డీజే, స్టేజ్ డెకరేషన్ పనులు చేస్తూ జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించేందుకు రాత్రివేళల్లో మోటార్లను దొంగిలిస్తున్నట్లు తేలింది.

నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ, ములుగు మండలాల పరిధిలోని గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. దొంగిలించిన మోటార్లను రాజుపేట శివారులో పొదల్లో దాచిపెట్టగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారు హంస ప్రశాంత్ (27), అన్న శివప్రసాద్ (22), ఎస్.కె. దస్తగిరి అలియాస్ షైర్ (20). మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఒక ట్రాలీ ఆటో, ప్యాసింజర్ ఆటో, పల్సర్, షైన్ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులు మోటార్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు. ముఠా పట్టివేతలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్, ఎస్సై రాజన్‌బాబు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>