కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో (TPCC Chief Mahesh Kumar Goud) రాష్ట్ర బీసీ సంఘాల నేతలు (BC Leaders) మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో డిసెంబర్ 14న జరగనున్న బీసీల జన భేరి గర్జన సభకు సంబంధించిన పోస్టర్‌ను మహేశ్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సభకు హాజరు కావాలని ఆయనను బీసీ సంఘాల నేతలు ఆహ్వానించారు.
టీపీసీసీ చీఫ్ తో సమావేశానంతరం మీడియాతో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో ఓబీసీ కాలం చేర్చకుండా బీసీలను మోసం చేస్తుందని మండిపడ్డారు. బీసీ కులాల లెక్కలు తేలకపోవడంతో దేశంలో బీసీలు గత 80 ఏళ్లుగా తమ హక్కులు కోల్పోతున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఓబీసీ కాలం చేర్చి బీసీ కులగణన చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఓబీసీ కులగణన నిర్వహించేందుకు బీజేపీ పార్టీ తప్ప దేశంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని.. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో సైతం తీర్మానం జరిగిందని గుర్తు చేశారు. ఢిల్లీలో భారీ సభతో బీసీల తడాఖాను కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తాని అన్నారు.

