రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎస్పీ శరత్ చంద్ర పవార్

కలం, నల్లగొండ : ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని, రోడ్డు భద్రత (Road Safety) అనేది కేవలం పోలీసులది మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. గురువారం నార్కట్‌పల్లి కామినేని వైద్యశాల ఆడిటోరియంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 2 లక్షల మంది, తెలంగాణలో 8 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 350 మంది మృత్యువాత పడటం ఆందోళనకరమన్నారు. గురువారం చిట్యాల వద్ద ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందడం ప్రమాదాల తీవ్రతకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం, నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని, ప్రయాణం ఎంత దూరమైనా ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అలాగే యువత మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జిల్లాలో ఇప్పటివరకు డ్రగ్స్‌కు బానిసైన సుమారు 500 మందిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల ప్రవర్తనపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం కామినేని వైద్యశాల ఉద్యోగులకు ఎస్పీ ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు.

వైద్య విద్యార్థులు, సిబ్బందితో కలిసి కామినేని ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్‌బీ సీఐ నాగరాజు, నార్కట్‌పల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, డీటీఆర్‌బీ ఇన్‌ఛార్జ్ రిటైర్డ్ సీఐ అంజయ్య, కామినేని ప్రిన్సిపాల్ బాబాసాహెబ్ లక్ష్మణ్ సింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరామ్ మోహన్, వైస్ ప్రిన్సిపాల్ సతీష్, డాక్టర్ రఘునందన్, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>