కలం, తెలంగాణ బ్యూరో: ఇంటర్ బోర్డు (Telangana Inter Board)ను స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాబోయే అసెంబ్లీ సెషన్లో చట్టం చేసేందుకు కసరత్తు మొదలైంది. ముసాయిదా బిల్లు రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకూ సెకండరీ స్కూల్ హెడ్మాస్టర్లుగా ఉన్నవారు ఈ చట్టం తర్వాత ప్రిన్సిపాళ్లు కానున్నారు. ఇంతకాలం స్కూల్ ఎడ్యుకేషన్‌కు హెడ్‌గా డైరెక్టర్ ఉండగా, ఇక నుంచి కార్యదర్శి స్థాయిలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ హోదాలో పర్యవేక్షిస్తారు.
ఇంతకాలం ఉనికిలో ఉన్న వ్యవస్థ కొత్త రూపంలోకి వెళ్తున్నందున తలెత్తే సందేహాలను నివృత్తి చేసేలా, ఎగ్జిక్యూషన్లో కన్ఫ్యూజన్ లేకుండా పకడ్బందీగా బిల్లు రూపకల్పన జరుగుతున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టెన్త్ క్లాస్ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న డ్రాప్ ఔట్స్ తగ్గుతాయని, రాష్ట్రంలో సగటు అక్షరాస్యత మెరుగుపడుతుందనే అభిప్రాయాన్ని ఆఫీసర్లు వ్యక్తం చేశారు. ఇంటర్ స్థానంలో ప్లస్ వన్, ప్లస్ టూ ఉనికిలోకి వస్తున్నందున ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నవారితోనే సిలబస్, కరిక్యులం రూపొందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.
ప్రైవేటు భవనాల్లోని స్కూళ్లు, కాలేజీల సర్దుబాటు
వీలైనంత వరకు ప్రైవేటు భవనాల్లో ఉన్న స్కూళ్లు, కాలేజీలను సొంత భవనాల్లోనే కొనసాగేలా సర్దుబాటు చేసేలా ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల స్కూళ్లు ప్రైవేటు భవనాల్లో ఉన్నందున ఇప్పుడు ఇంటర్ విలీనం నిర్ణయంతో జూనియర్ కాలేజీల్లో తగిన స్థలం ఉన్నట్లయితే అందులోకే మార్చాలని ఆలోచిస్తున్నారు. అవసరమైన తరగతి గదులు లేకపోయినా స్థలం ఉంటే కొత్త క్లాస్ రూమ్స్ నిర్మించుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ప్రైవేటు భవనాల్లో జూనియర్ కాలేజీలు పనిచేస్తున్నట్లయితే ప్లస్ వన్, ప్లస్ టూ తరగతులు సమీపంలోని సెకండరీ స్కూళ్లలో తగినంత స్థలం, తరగతి గదులు ఉన్నట్లయితే అక్కడికి షిఫ్ట్ చేసేలా ఆలోచిస్తున్నారు.
పదో తరగతి తర్వాత జూనియర్ కాలేజీలు దగ్గర్లో లేకపోవడంతో దూరం వరకూ వెళ్లి చదువుకోవడంలోని ఇబ్బందులు, డ్రాప్ ఔట్ అవుతున్నవారిలో ఎక్కువగా బాలికలే ఉంటున్నందున వారికి తగిన విద్యావకాశాలు కల్పించడానికి ఇంటర్ విలీనం విధానం తోడ్పడుతుందన్నది అధికారుల వాదన. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సిబ్బందికి ఉద్యోగ భద్రత, పదోన్నతుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని ముఖ్యమంత్రి చెప్పినా.. కొందరిలో సందేహాలు కొనసాగుతున్నందున ఈ బిల్లులో క్లారిటీ లభించే అవకాశమున్నది.
నాలుగేండ్ల విద్య.. స్థానికతపై స్పష్టత
ఇంటర్ బోర్డును రద్దు చేసి స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల విషయంలో తలెత్తుతున్న సందేహాలకు సైతం ఈ బిల్లు స్పష్టత ఇచ్చే అవకాశమున్నది. తెలంగాణలో వరుసగా నాలుగేండ్లు చదివినవారినే స్థానికులుగా గుర్తించేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో, రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల నేపథ్యంలో లీగల్ కోణం నుంచి కూడా ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు.
చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు టెన్త్ వరకు అక్కడ చదివి ఇంటర్ (ప్లస్ వన్, ప్లస్ టూ) కోసం ఇక్కడికి వచ్చి చదువుతున్నారని, తెలంగాణకు చెందినవారు సైతం కొందరు ఆంధ్రప్రదేశ్‌లో ఇలా చదువుకుంటున్నారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని 1-7 తరగతుల మధ్య నాలుగేండ్లు (నాలుగు తరగతులు) తెలంగాణలో చదివినవారినే స్థానికులుగా గుర్తించాలనే పాత జీవోకు అనుగుణంగానే కొత్త బిల్లులో సైతం స్పష్టమైన వివరాలను పొందుపర్చాలని ఆఫీసర్లు భావిస్తున్నారు.

