డప్పు కళాకారులకు పెన్షన్ కల్పించాలని డిమాండ్

కలం, నారాయణపేట్: అర్హులైన డప్పు కళాకారులకు (Dappu Artists) ప్రభుత్వం తక్షణమే పెన్షన్ ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. నారాయణపేట (Narayanpet) జిల్లా కేంద్రంలో మొదటిసారిగా బుధవారం ఆది జాంబవ డప్పుల సంఘం (Aadi Jambava Dappula Sangham) ఆధ్వర్యంలో డప్పు కళాకారులతో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ముందుగా భారంభావి నుంచి డప్పులతో కళాకారులు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీగా సత్యనారాయణ చౌరస్తా వరకు చేరుకున్నారు. ర్యాలీని అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షులు యు మహేష్ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆది జాంబవ డప్పుల సంఘం నారాయణపేట జిల్లా మొదటి సభలో వక్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో డప్పు కళాకారులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందన్నారు. ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం జరిగినా.. గ్రామాల్లో ఉత్సవాలు, శోభాయాత్రలు జరిగినా డప్పు కళాకారులు తప్పనిసరిగా ఉంటారన్నారు. ఇన్నేళ్లు రాజకీయ పార్టీలకు డప్పు వాయించామని ఇకపై తమ హక్కుల కోసం న్యాయబద్ధంగా పోరాడుతామన్నారు. డప్పు కొట్టే వృత్తి మాదిగలదన్నారు. డప్పు కళాకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేలా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి దృష్టికి తీసుకెళ్దామన్నారు. డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించుకునేలా కార్యాచరణ తో ముందుకెళ్దామన్నారు.

ప్రపంచ సంగీతానికి వన్నె తెచ్చిన డప్పు నేడు అంటరానిదైందనీ డప్పు పట్ల చిన్న చూపు ప్రభుత్వానికి తగదన్నారు. తమ జాతి వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో స్థానం లేక బతుకుతెరువుకై వ్యవసాయ కూలీలుగా, హమాలీలుగా, పారిశుద్ధ్య కార్మికులుగా మరుగుదొడ్లు శుభ్రం చేసే కూలీలుగా చాలీచాలని జీవితాలలో జీవనం కొనసాగిస్తూ దుర్భరమైన జీవనం గడుపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షులు యూ.మహేష్, కౌన్సిలర్ భరత్, వడేప్ప, తిమ్మప్పతోపాటు నారాయణపేట నలుమూలల నుంచి సుమారు 500 మంది డప్పు కళాకారులు పాల్గొన్నారు.

ఆది జాంబవ డప్పుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక..

ఆది జాంబవ డప్పుల సంఘం నారాయణపేట జిల్లా కమిటీని బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాజు, జనరల్ సెక్రెటరీగా తిమ్మప్పతోపాటు మరికొంతమంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారుల సంక్షేమం కోసం పాటుపడతామని ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>