ఈ నెల 23న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కారణమిదే!

కలం, వెబ్ డెస్క్ : నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) అమలుపై కీలక అడుగు వేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను (Parliament Special Session) నిర్వహించే అంశంపై కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ స్థానాల గరిష్ట సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 850కి పెంచేందుకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై తీర్మానం చేసే అవకాశం ఉంది.

అయితే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే సభలో మూడింట రెండొంతుల మెజారిటీ (కనీసం 361 మంది ఎంపీల మద్దతు) తప్పనిసరి. ప్రస్తుత లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం సుమారు 320 మాత్రమే ఉంది. దీంతో విపక్షాల మద్దతు కూడగట్టడం ఎన్డీయే సర్కార్ కు కీలకంగా మారింది. గత ఏప్రిల్ 17న జరిగిన ప్రత్యేక సమావేశంలో ఇదే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టినప్పటికీ, విపక్షాల అభ్యంతరాలు, తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆమోదం లభించలేదు.

జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమకు కొత్త జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ నిర్వహిస్తే పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గి అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలను, దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించేందుకు కేంద్రం కొత్త ఫార్ములాను పరిశీలిస్తోంది. 1971 జనాభా లెక్కల ఆధారంగానే రాష్ట్రాల పాత వాటా నిష్పత్తిని కొనసాగిస్తూ, అన్ని రాష్ట్రాల లోక్‌సభ స్థానాలను దామాషా పద్ధతిలో 50 శాతం పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రేపో, ఎల్లుండో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల షెడ్యూల్ విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియా వర్గాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>