కలం, నల్లగొండ : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయనున్నట్లు అఖిల భారత కిసాన్ సభ (AIKS) ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ ప్రకటించారు. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మహాసభల కీలక నిర్ణయాలను వెల్లడించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు విజ్జు కృష్ణన్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ నవంబర్ 26న నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో తదుపరి రైతాంగ పోరాట కార్యాచరణను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని మహాసభలు డిమాండ్ చేశాయన్నారు. కార్మిక చట్టాలను ఉపసంహరించుకుని, ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరారు.
వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజువారీ కూలిని పెంచాలని, ఎల్నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం, పంటల బీమా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాసభల్లో 64 మంది ప్రతినిధుల చర్చల అనంతరం ప్రధాన కార్యదర్శి నివేదికకు ఏకగ్రీవ ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. అనంతరం కిసాన్ సభ నూతన జాతీయ నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శిగా విజ్జు కృష్ణన్, ఆర్థిక కార్యదర్శిగా కుష్పేంద్ర త్యాగి ఎన్నికయ్యారని, వీరితో పాటు 12 మంది ఉపాధ్యక్షులు, 12 మంది సంయుక్త కార్యదర్శులతో కూడిన నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన జాతీయ కమిటీలో తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు దక్కాయి. రాష్ట్రం నుంచి టీ. సాగర్, పోతినేని సుదర్శన్ జాతీయ సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. అలాగే కామ్రేడ్ రంగన్న కేంద్ర కిసాన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రైతాంగ హక్కుల సాధన కోసం రానున్న రోజుల్లో కిసాన్ సభ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని విజ్జు కృష్ణన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

