కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పాలనలో కీలక ఘట్టానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తెరలేపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Body Elections) భాగంగా నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా.. 7న ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మండల, జిల్లా పరిషత్‌ల పరోక్ష ఎన్నికలు, నూతన సభ్యుల పదవీకాలం ప్రారంభంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం రేపటి (నవంబర్ 19) నుంచి ప్రారంభం కానుండగా, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
వీరితో పాటు ఆయా పరిషత్‌లలో నియమితులయ్యే కో-ఆప్టెడ్ సభ్యుల పదవీకాలం కూడా ఐదేళ్ల పాటు కొనసాగనుందని కమిషన్ స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. రేపు (నవంబర్ 19) రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్‌ల తొలి సమావేశాలు నిర్వహించి, ఎంపీపీ (మండల పరిషత్ అధ్యక్షుడు), వైస్ ఎంపీపీల ఎన్నికను పూర్తి చేస్తారు. అనంతరం నవంబర్ 20వ తేదీన జిల్లా పరిషత్‌ల తొలి ప్రత్యేక సమావేశాలు జరిపి జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రిసైడింగ్ అధికారుల నియామకంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

