నాలుగో అంతస్తు నుంచి దూకిన మహిళ.. రెండు కాళ్లు విరిగి, తలకు తీవ్ర గాయాలు..

కలం, నిర్మల్ : కుటుంబ కలహాలు ఓ వివాహితను ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పురిగొల్పాయి. భర్తతో చోటుచేసుకున్న వాగ్వాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద నిర్మాణంలో ఉన్న నాలుగో అంతస్తు భవనం నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతకు భర్త రవితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య, అత్తవారితో కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో బుధవారం ఇద్దరు పిల్లలతో కలిసి నిర్మల్ (Niraml) పట్టణానికి వచ్చిన సంగీత భర్తతో మాట్లాడేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అక్కడి నుంచి శివాజీ చౌక్ వద్ద ఉన్న నిర్మాణంలో ఉన్న భవనంపైకి వెళ్లింది. నాలుగో అంతస్తుపైకి చేరుకున్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆమెతో మాట్లాడారు. భర్తను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొందరు యువకులు ఆమెను కాపాడేందుకు భవనంపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఆమె కిందకు దూకింది.

కింద ఉన్నవారు, పోలీసులు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన(Suicide Attempt)లో సంగీతకు రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. తన ఇద్దరు పిల్లలను చూసుకోవాలని ఆమె వేడుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే తన కుమార్తె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె తల్లి పేర్కొంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read : ‘బిడ్డా రేవంత్‌.. ఖబర్దార్’.. రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>