కలం, మెదక్ బ్యూరో : బీఆర్ఎస్ కు గుండెకాయ వంటి సిద్దిపేటపై (Siddipet Politics) సీఎం రేవంత్, టీఆర్ఎస్ చీఫ్ కవిత గురిపెట్టారు. రాజకీయంగా పట్టు సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ అయిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై ముప్పేట దాడికి దిగుతున్నారు. ఒకవైపు కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తన తొలి జిల్లా ఆఫీసుకు భూమిపూజ చేసిన తర్వాత మీడియా వేదికగా హరీశ్ పై విమర్శలు గుప్పించారు. మరోవైపు గురువారం సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఉండగా రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయనతోనే వ్యాపారులు నష్టపోయారని..
టీఆర్ఎస్ ఆఫీసుకు భూమిపూజ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి. హరీశ్ హయాంలోనే స్థానిక వ్యాపారులు నష్టపోయి యజమానుల నుంచి గుమస్తాలుగా మారాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించి చేనేత వ్యాపారానికి నష్టం కలిగించారని విమర్శించారు. గోల్డ్ వ్యాపారులను ఫోన్ ట్యాపింగ్, అక్రమ కేసుల పేరుతో వేధించారని ఆరోపణలు చేశారు.
హరీశ్ ఎమ్మెల్యే కాకముందు 120 రైస్ మిల్లులు ఉండేవని, ప్రస్తుతం 20కి కూడా పడిపోయిందని పేర్కొన్నారు. ఆయన రాకముందే సబ్స్టేషన్లు, ఇంటింటికీ నల్లా నీరు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి సదుపాయాలు వచ్చాయని, అయినా అభివృద్ధి అంతా తనే చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ తన బాధ్యతలను హరీశ్ కు అప్పగించారని, అయినా ఆయనకు వెన్నుపోటు పొడిచారని తీవ్రంగా ఆరోపించారు. ప్రస్తుతం సిద్దిపేట ప్రజలు భయం, ఆందోళన మధ్య జీవిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల నుంచే తన రాజకీయ పోరాటం ప్రారంభించి టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు. కవిత ఆరోపణలపై స్థానికంగా విస్తృత చర్చ నెలకొంది.
సీఎం ఏం మాట్లాడుతారో..?
బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇలాకాలే లక్ష్యంగా సీఎం రేవంత్ రాజకీయంగా దూకుడు పెంచారు. ఇప్పటికే సిరిసిల్లలో పర్యటించి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తదుపరి సిద్దిపేట, గజ్వేల్ లో పర్యటిస్తానని ఇంతకుముందే ప్రకటించారు. గురువారం సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. అందులో హరీశ్‌ను ఏయే అంశాలపై సీఎం లక్ష్యంగా చేసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలు, రంగనాయకసాగర్ సమీపంలోని ఫామ్‌హౌస్, కుటుంబ సభ్యుల వివాదాలను కూడా ప్రస్తావించే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ప్రధాన అస్త్రంగా మారుతుందని, హరీశ్ పై నమోదైన కేసులతో విమర్శలు చేయొచ్చనే చర్చ సాగుతోంది. సిద్దిపేట అభివృద్ధి పేరుతో జరిగిన అవినీతి, అక్రమాలపై కూడా ప్రస్తావించవచ్చని సమాచారం. ఈ సభ ద్వారా హరీశ్‌ను రాజకీయంగా ఇరుకున పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమని పార్టీ నేతలు చెబుతుండగా, మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అలర్ట్ అయ్యారు.
హాట్ టాపిక్‌గా సీఎం సభాస్థలి మార్పు
సీఎం సభ స్థలాన్ని మార్చడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ముందుగా జిల్లా కేంద్రంలోని నాగదేవత ఆలయం నుంచి సిరిసిల్లకు వెళ్లే బైపాస్ రోడ్డు పక్కన సభ కోసం ఎంపిక చేశారు. భూమిని చదును కూడా చేయడంతో పాటు ఇతర పనులు చేపట్టారు. అనంతరం సభాస్థలిని ఎందుకు మార్చారనేది చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నాగదేవత ఆలయం సమీపంలో బహిరంగ సభ నిర్వహించారని, దీంతో బీఆర్ఎస్ ఓటమి చెందడంతో కొందరు కాంగ్రెస్ నేతలు సెంటిమెంట్ కారణంగా అక్కడ వద్దని సీఎంకు సూచించినట్లు ప్రచారంలో ఉంది. దీంతో మరో ప్రాంతానికి మార్చినట్లు చర్చలో ఉంది. మొత్తంగా కవిత విమర్శలు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, సభా స్థల మార్పు వంటి వరుస పరిణామాలతో కొద్దిరోజులుగా సిద్దిపేట రాజకీయాలు వేడెక్కాయి. ఇలా వరుస రాజకీయ పరిణామాలు హరీశ్‌కు సవాలుగా మారుతున్నాయని రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.

