కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ విద్య పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ధ్వజమెత్తారు. బోధకులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా పస్తులు ఉంచుతోందని మండిపడ్డారు. మంగళవారం కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,032 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ అర్హతతో నియమితులైన ప్రీ-ప్రైమరీ బోధకులకు నెలకు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేలు ఇస్తామని చెప్పి నేటికీ ఒక్క నెల వేతనం కూడా చెల్లించలేదని కామేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ శాఖపై సమీక్ష నిర్వహించలేదని, తెలంగాణ మోడల్ స్కూళ్లు కేవలం కాంట్రాక్టర్ల కోసమే చేపడుతున్నట్లుగా ఉన్నాయని విమర్శించారు.
సీఎంకు విద్య పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే మియాపూర్ భూముల విక్రయం ద్వారా వచ్చే రూ.30 వేల కోట్లకు పైగా నిధులను ‘విద్యానిధి’లో జమ చేసి, 1,200 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, 1,200 ఫౌండేషన్ స్కూళ్లు, 150 డిగ్రీ కళాశాలలు, 17 యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని సూచించారు. లేనిపక్షంలో విద్యారంగ సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గజ్జెల శంకర్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు చెనిగరపు నిరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

