కలం, ఆదిలాబాద్ : నషా ముక్త్ భారత్ (Nasha Mukt Bharat) అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు, యువతలో అవగాహన కల్పించేందుకు చేపట్టిన సైకిల్ యాత్రను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం నుంచి న్యూఢిల్లీ వరకు సుమారు 3,000 కిలోమీటర్ల మేర ఐ. విజయలక్ష్మి ఈ సైకిల్ యాత్రను చేపట్టారు. అక్టోబర్ 22న ప్రారంభమైన ఈ యాత్ర డిసెంబర్ 10వ తేదీ వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేస్తూ, యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడాలనే సంకల్పంతో ఐ. విజయలక్ష్మి చేపట్టిన ఈ సైకిల్ యాత్ర అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

