కలం, స్పోర్ట్స్: స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రీలంక, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ (ICC) భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025–27 సైకిల్లో భాగంగా రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో రెండు జట్లపై పాయింట్ల కోత విధించింది. శ్రీలంక 15 ఓవర్లు వెనుకబడటంతో 15 పాయింట్లు కోల్పోయింది. పాకిస్థాన్ ఐదు ఓవర్లు తక్కువగా వేయడంతో ఐదు పాయింట్లు కోతపడ్డాయి. దీంతో శ్రీలంక పాయింట్ల శాతం 33.33 నుంచి 15.47కు పడిపోయింది. ఆ జట్టు ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి దిగజారింది. పాకిస్థాన్ 3.33 శాతంతో చివరి స్థానంలోనే కొనసాగుతోంది.
పాయింట్ల కోతతో పాటు శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం, పాకిస్థాన్ ఆటగాళ్ల ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఇరు జట్ల కెప్టెన్లు బాబర్ ఆజమ్, కుశాల్ మెండిస్ తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేకుండానే ఐసీసీ చర్యలు తీసుకుంది. తొలి టెస్టు ఐదు రోజుల పాటు సాగి డ్రాగా ముగిసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 434/9 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక 446 పరుగులు చేసి 12 పరుగుల ఆధిక్యం సాధించింది. ధనంజయ డి సిల్వా 167, కుశాల్ మెండిస్ 119 పరుగులతో రాణించారు. అయితే అరంగేట్ర ఆటగాడు సాకిబ్ ఖాన్ ఏడు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బతీశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 284/8 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత ఓవర్ల కంటే ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే.. ఒక్కో ఓవర్‌కు ఒక పాయింట్ కోత విధిస్తారు. ఈ చర్యలను ఐసీసీ మ్యాచ్ రిఫరీ డీన్ కాస్కర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య రెండో టెస్టు రావల్పిండిలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే ఆలౌట్ చేశారు.

