దారుణం.. కన్నతండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు

కలం, ఖమ్మం బ్యూరో: భూమి వాటాకు సంబంధించిన డబ్బుల వివాదంలో కన్నతండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దుమ్ముగూడెం మండలం చినబండిరేవు (Chinna Bandirevu) గ్రామంలో ఇటీవల సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసులో ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని దుమ్ముగూడెం పోలీసులు మంగళవారం పర్ణశాలలో అరెస్ట్ చేశారు.

​భద్రాచలం డీఎస్పీ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. చినబండిరేవు గ్రామానికి చెందిన మేకల తాతయ్య (84)కు, అతని కుమారుడు మేకల ధనుంజయ్ (45)కు మధ్య భూమి వాటా డబ్బుల విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీ రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ధనుంజయ్ తన తండ్రి తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తాతయ్యను కుటుంబ సభ్యులు తొలుత భద్రాచలం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 10వ తేదీ సాయంత్రం 3:56 గంటలకు ఆయన మృతి చెందారు.

​మృతుడి పెద్ద కుమారుడు మేకల వీరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుమ్ముగూడెం పోలీసులు 10వ తేదీన హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు ధనుంజయ్ కోసం గాలిస్తున్న పోలీసులు, మంగళవారం పర్ణశాలలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని భద్రాచలంలోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>