కలం, వెబ్‌డెస్క్: ఓ ఐదేళ్ల బాలుడి మిస్సింగ్ కేసును పోలీసులు కేవలం రెండు గంటల్లో ఛేదించారు. మంగళవారం కనిపించకుండా పోయిన బాలుడిని క్షేమంగా రక్షించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ (Saroornagar Police) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన భూక్య శైలజ, సంతోష్ దంపతులు సరూర్‌నగర్‌లోని ప్రియదర్శిని పార్క్ సమీపంలో నివసిస్తుంటారు. శైలజ తన కజిన్ కొడుకు భూక్య అమృత్ (5)ను, అతడి తల్లిదండ్రులను హైదరాబాద్‌కు తీసుకొని వచ్చింది.
ఈ క్రమంలో ప్రియదర్శిని పార్క్ వద్ద బాలుడు సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం తల్లిదండ్రులు పార్క్ చుట్టూ వెతికారు. కానీ, లాభం లేకుండా పోయింది. ఇక బాలుడి బంధువులు సరూర్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల వెతుకులాట అనంతరం సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 1 వద్ద బాలుడిని గుర్తించారు. అనంతరం బాలుడిని కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

