కలం, ఖమ్మం బ్యూరో: మద్యం మత్తులో వాహనాలు నడిపేవారికి న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. మద్యం తాగి స్టీరింగ్ పడితే కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా నేరుగా జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని దమ్మపేట కోర్టు తన తీర్పు ద్వారా స్పష్టం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఏకంగా 42 మంది నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ భవానీ మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు.
కోర్టు తీర్పు ప్రకారం పట్టుబడిన 42 మంది నిందితుల్లో తీవ్రతను బట్టి 11 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఇందులో ఏడుగురికి మూడు రోజుల చొప్పున, మరో నలుగురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మిగిలిన 31 మంది నిందితులకు కోర్టు మొత్తం రూ.70,000 జరిమానా విధించింది. ఇందులో ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున రూ.24,000, మరో 23 మందికి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున రూ.46,000 జరిమానా కట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ సందర్భంగా అశ్వారావుపేట పోలీసులు వాహనదారులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి, ఏ పాపం ఎరుగని అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

