కలం, వెబ్ డెస్క్: తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2001 ఏప్రిల్ 27న కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. 2026లో కూడా బీఆర్ఎస్ అదే వైఖరితో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడటానికి కారణం సోనియా గాంధీ వ్యక్తిగత దయ కాదని.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సాగించిన పోరాటమేనని అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) అభయహస్తం చూపించిందని.. ఎన్నికల తర్వాత రిక్తహస్తం చూపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ వంచనకు అభయహస్తం మేనిఫెస్టోనే ప్రతిరూపమని పేర్కొన్నారు. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా అది చరిత్రలో నిలిచిపోతుందని అభివర్ణించారు. అడ్డమైన హామీలిచ్చి రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సాధించింది శూన్యమని పేర్కొన్నారు.
తెలంగాణలో అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల రంగాలు ముందుకు సాగాల్సింది పోయి వెనక్కి వెళ్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. మూడు ఏళ్ల తెలంగాణ నాట్ రైసింగ్.. తెలంగాణ ఫాలింగ్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భూముల ధరలు పడిపోతున్నాయని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు వంటి అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

