కలం, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కోడి మృతి చెందితే యజమాని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. తన కోడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చేర్యాల (Cherial) మండలం ఆకునూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆకునూరులో పౌడాల రాములు అనే వ్యక్తి కొన్ని కోళ్లను పెంచుకుంటున్నాడు. మంగళవారం మల్లోజు రవికుమార్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టడంతో రాములుకు చెందిన ఓ కోడి మృతి చెందింది.
దీనిపై రాములు రవికుమార్‌ను నిలదీశాడు. కోడిని ఎందుకు చంపావంటూ ప్రశ్నించాడు. అయితే రవికుమార్ సరైన సమాధానం ఇవ్వకపోగా తమతో దురుసుగా ప్రవర్తించాడని రాములు ఆరోపిస్తున్నాడు. అలాగే తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపాడు. కోడిని ఎందుకు చంపావని ప్రశ్నిస్తే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడన్నారు. దీంతో రాములు దంపతులు చేర్యాల పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. రవికుమార్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

