కోనసీమలో తగ్గిన టెన్షన్.. అదుపులోకి గ్యాస్ లీకేజీ!

కలం, వెబ్ డెస్క్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం తాడివారి పుంత గ్రామ పరిధి వద్ద ఉన్న ఓఎన్‌జీసీ రీడ్రిల్లింగ్ బావిలో సంభవించిన భారీ గ్యాస్ లీకేజీ (ONGC Gas Leak) ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో బావిలో మరమ్మతు పనులు జరుగుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ ఉవ్వెత్తున ఎగజిమ్మింది. జాతీయ రహదారి-216 పక్కనే ఈ ఘటన చోటుచేసుకోవడం, గతంలో జరిగిన ఇరుసుమండ బ్లో అవుట్ తాలూకు భయాలు ఇంకా వీడకపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళకు లోనయ్యారు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి.. బావి చుట్టూ ఒక కిలోమీటరు పరిధిలోని సుమారు 800 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిప్రమాదాలు తలెత్తకుండా ఫైర్ సిబ్బంది బావి చుట్టూ నిరంతరాయంగా నీటిని పిచికారీ చేస్తూ ‘వాటర్ అంబ్రెల్లా’ను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం ఉన్నతాధికారులతో సమీక్షించి, ఓఎన్‌జీసీ భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు.

ఇదిలాఉంటే నర్సాపురం నుంచి ప్రత్యేకంగా రప్పించిన ఓఎన్‌జీసీ బ్లో అవుట్ కంట్రోల్ నిపుణుల బృందం దాదాపు 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని చక్కదిద్దింది. బావిలోకి ప్రత్యేకంగా బురదను పంప్ చేసి, షియర్ ర్యామ్‌ను విజయవంతంగా అమర్చడంతో గ్యాస్ లీకేజీ పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, అగ్నిప్రమాదం గానీ జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>