కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో మరో కల్తీ ఆహార దందా వెలుగులోకి వచ్చింది. స్వీట్లకు వెండి పూత పూసేందుకు ఉపయోగించే సిల్వర్ ఫాయిల్ (Fake Silver Foil) ను అల్యూమినియంతో తయారు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఈ దందా నడుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్న నాలుగు తయారీ కేంద్రాలపై హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇక్కడ నకిలీ వెండి పూతను తయారు చేసి పెద్ద పెద్ద స్వీట్ షాపులు, బేకరీలు, పాన్ షాపులకు అసలైనదిగా నమ్మించి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితులు వెండి స్థానంలో తక్కువ ధరకు లభించే అల్యూమినియం ఉపయోగించి వెండి రంగులో పలుచని రేకుల్లా చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేకుండానే వీటిని తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్ ప్రాంతంలోని ఇత్తెహాద్ వర్క్ షాప్, యూటీసీ సిల్వర్ లీఫ్స్, ఎంఏ మెట్రో వర్క్ షాప్‌తో పాటు ఫలక్‌నుమాలోని బీబీకాచస్మా ప్రాంతంలో ఉన్న తారా యూనిట్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనపై చార్మినార్, హుస్సేనియాలం, మొగల్‌పురా, ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లలో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నాలుగు యూనిట్లలో నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు భారీగా నకిలీ వెండి రేకులు, అల్యూమినియం ఫ్లేక్స్, ఇతర ముడిసరుకులు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 49 బండిల్స్ నకిలీ వెండి రేకులు, కార్టన్లలో ప్యాక్ చేసిన 10 కిలోల అల్యూమినియం ఫ్లేక్స్, ఒక్కో కిలో చొప్పున ఉన్న రెండు పాలిథిన్ బ్యాగులు ఉన్నాయి.

