కలం, కరీంనగర్ బ్యూరో: ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎస్ బాబు డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కరీంనగర్ జోనల్ మహాసభ (Karimnagar Zonal Meeting) విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు బాబు మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఇటీవల జరిగిన గుర్తింపు సంఘాల ఎన్నికల్లో రాష్ట్ర గుర్తింపుకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ను ఘనంగా గెలిపించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ముందుండి పోరాడుతుందని భరోసా ఇచ్చారు. ఇటీవల యాజమాన్యం ఇచ్చిన కోడ్ ఆఫ్ డిసిప్లేన్ సర్కులర్ ను వెంటనే ఉపసంహారించుకుని పాత పద్దతిలో ఇవ్వాలని, లేనియెడల పోరాటం తీవ్రమవుతుందని హెచ్చరించారు.
ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికుల హక్కుల కోసం రాజీలేనిపోరాటం చేస్తుందని, తమపై నమ్మకం ఉంచి గెలిపించిన కార్మికవర్గానికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన గుర్తింపు సంఘాల ఎన్నికల్లో సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్ రీజియన్లలో మెజారిటీ రాకున్నా గుర్తింపును ప్రభుత్వ సహకారంతో లేబర్ కమిషనర్ ఏకపక్షంగా కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికులదే ఉండాలని అన్నారు.
ఈ జోనల్ మహాసభలో యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అప్పారావు, రాష్ట్ర కార్యదర్శులు సంజీవ్ కాళిదాసు స్వామి, జీఎస్ నారాయణ, బొట్టు లక్ష్మయ్య, ఖదీర్, సీహెచ్ వీరన్న, జోనల్ నాయకులు మధు, లింబాద్రి, లలిత, ఉమా, రీజియన్ నాయకులు కొమురయ్య, గణపతి జోనల్ లోని అన్నీ డిపోల నాయకులు పాల్గొన్నారు.

