కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతే ఇంత వరకు ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వడగండ్ల వాన పడి పంట నష్టం జరిగితే ఎకరానికి రూ. 10 వేలు ఇచ్చారని గుర్తు చేశారు. రైతులంటే రేవంత్ రెడ్డికి పట్టింపే లేదని విమర్శించారు. 25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతే, ఇప్పటివరకు ఎన్యూమరేషన్ జరగలేదని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎకరానికి రూ. 5 వేల నష్టపరిహారం ఇచ్చారని అన్నారు. తెలంగాణలో కూడా ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే యాసంగి రైతుబంధు, సన్నలకు బోనస్ ఇవ్వాలని కోరారు. దొడ్డు వడ్లు సైతం కొనాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా రైతులతో ముచ్చటించి మాట్లాడారు.
ఇప్పటివరకు రెండు యాసంగి సీజన్లలో సన్న వడ్లకు బోనస్ ఇవ్వలేదని హరీశ్ రావు మండిపడ్డారు. కనీసం ఈ వానాకాలం సన్న వడ్లకైనా బోనస్ ఇస్తారా లేదా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డిని నమ్మి సన్న వడ్లను రైతులు సాగు చేస్తే వాళ్ళు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బోనస్ ఇవ్వకుండా, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను రేవంత్ రెడ్డి ఇబ్బందికి గురిచేస్తున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ కొనకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులకు తక్కువకి అమ్మి రైతులు నష్టపోతున్నారని అన్నారు. మేనిఫెస్టో ప్రకటించి మూడేళ్లు అయిందని.. కానీ హామీల అమలులో మాత్రం సున్నా అంటూ దుయ్యబట్టారు. అభయహస్తం పేరుతో వచ్చి.. ప్రజలకు శూన్యహస్తం చూపించారని ఎద్దేవా చేశారు.

