అలుగునూరులో దీక్షా దివస్ సభ.. బీఆర్ఎస్ విస్తృత ప్రచారం

కలం, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక మలుపుగా నిలిచిందన్నారు. ఈ నెల 29న దీక్షా దివస్ (Deeksha Diwas) సందర్భంగా కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేసిన అలుగునూరులో (Alugunur) భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

కరీంనగర్‌లోని ఇందిరానగర్ చింతకుంటలో గల బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉధృతమైందని గుర్తుచేశారు. కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు ఉద్యమంలో భాగస్వాములయ్యాయని తెలిపారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించినా దీక్ష కొనసాగించారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమ ఒత్తిడితో 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. అయితే డిసెంబర్ 23న కేంద్రం తన ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో తెలంగాణలో మళ్లీ ఉద్యమం ఉధృతమైందని, ఆ తర్వాతి పరిణామాల్లో ఎంతోమంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని వర్గాల ప్రజల పోరాటం

తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ పార్టీకి పరిమితం కాలేదని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు, మహిళలు, యువత భాగస్వామ్యంతో సాగిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించిన ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిందన్నారు.

వారం రోజులపాటు ప్రచార కార్యక్రమాలు

దీక్షా దివస్ సభను అలుగునూరులో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సభకు కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల నుంచి ప్రజలను సమీకరించేందుకు పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దీక్షా దివస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాల్ రైటింగ్, కరపత్రాల పంపిణీ, సోషల్ మీడియా ప్రచారం, ఇంటింటి ప్రచారం, మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు.

దీక్షా దివస్ కేవలం పార్టీ కార్యక్రమం కాదని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని స్మరించుకునే చారిత్రక దినోత్సవమని పేర్కొంటూ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ అభిమానులు రాజకీయాలకు అతీతంగా సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజలకు రవాణా, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అనుమతుల కోసం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేయాలని సమావేశంలో చర్చించారు.

ముఖ్య నాయకుల హాజరు

ఈ సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఒడితల సతీష్ కుమార్, రవిశంకర్, దాసరి మనోహర్ రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు తుల ఉమ, దావ వసంత, జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>