వరుస భూప్రకంపనలతో వణికిన మణుగూరు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకున్న వరుస భూప్రకంపనలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఒకే రోజు సుమారు నాలుగుసార్లు భూమి కంపించినట్లు పలు ప్రాంతాల ప్రజలు చెబుతుండటంతో పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో తీవ్ర కలకలం రేగింది. అసలు ఈ ప్రకంపనలకు కారణమేంటో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

మంగళవారం ఉదయం సుమారు 11:28 గంటల సమయంలో మల్లెపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాంతంలో మొదటగా భూమి కంపించినట్లు స్థానికులు గుర్తించారు. ఆ భయం నుంచి తేరుకోకముందే, ఉదయం 11:40 గంటల సమయంలో శివలింగాపురం ప్రాంతంలో వరుసగా మూడుసార్లు భారీ శబ్దాలతో భూమి కంపించింది. ఇళ్లలోని పైకప్పులు, వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మణుగూరు పట్టణంలోని పలు కాలనీల్లోనూ ఇదే తరహా అనుభూతి కలిగినట్లు స్థానికులు చెప్తున్నారు.

పెరుగుతున్న అనుమానాలు..

సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు మణుగూరు కేంద్రంగా ఉంది. సాధారణంగా మైనింగ్ బ్లాస్టింగ్ సమయంలో ప్రకంపనలు రావడం సహజం. అయితే, మంగళవారం ప్రకంపనలు వచ్చిన సమయం బ్లాస్టింగ్ వేళలు కాకపోవడం గమనార్హం. పైగా ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రకంపనలు రావడంతో ఇది సహజసిద్ధమైన భూకంపమా? లేక భూగర్భ తవ్వకాల ప్రభావమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

​టెలికాం, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం..

ప్రకంపనలు సంభవించిన సమయంలోనే మణుగూరు పరిసరాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పాటు మొబైల్ సిగ్నల్స్ కూడా స్తంభించిపోయాయి. ప్రకంపనల తీవ్రతకు టవర్లు, కేబుల్ వ్యవస్థపై ప్రభావం పడిందా? లేక ఇది యాదృచ్ఛికంగా జరిగిన సాంకేతిక లోపమా? అన్నది టెలికాం సంస్థలు స్పష్టం చేయాల్సి ఉంది.

​శాస్త్రీయ విచారణ జరిపి భరోసా కల్పించాలి..

గతంలోనూ మణుగూరు ప్రాంతంలో ఇలాంటి ప్రకంపనలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు గనుల మధ్య నివసిస్తున్న తమకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ​జిల్లా కలెక్టర్, సింగరేణి యాజమాన్యం, మైనింగ్ శాఖ, భూకంప పరిశీలన నిపుణులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సీస్మోగ్రాఫ్ (భూకంప కొలతల పరికరాలు) ద్వారా ప్రకంపనల తీవ్రత, కేంద్ర స్థానాన్ని శాస్త్రీయంగా విశ్లేషించాలని, సింగరేణి బ్లాస్టింగ్ రికార్డులను సరిచూసి అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే భూగర్భ శాస్త్ర నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపి, ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>