కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ (BRS) నేతలు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అభయహస్తం ప్రతులను చించి చెత్తబుట్టలో వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసిందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు.
420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. ఇది ప్రజలకు అభయహస్తం కాదని, భస్మాసుర హస్తంగా మారిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం బాండ్ పేపర్లు రాసిచ్చి మరీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మినందుకు నేడు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు చిత్తు కాగితంతో సమానంగా చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నీటి కొరత లేదని నీటిపారుదల శాఖ మంత్రి చెబుతుంటే, నీటి కొరత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, అసలు రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వం నడుస్తుందో అర్థం కావడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల సంగతేంటో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
Also Read : కేటీఆర్.. మీ ఆస్తుల పెరుగుదల పై ప్రజలకు నిజాలు చెప్పాలి : ఎంపీ వంశీకృష్ణ
Follow Us On: X(Twitter)

