కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ క్రీడాకారుల సత్తాను దేశానికి చాటేందుకు గొప్ప అవకాశంగా భావిస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌లో కబడ్డీ పోటీల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం పరిశీలించారు. మహబూబ్‌నగర్ మినీ స్టేడియాన్ని సందర్శించిన మంత్రి.. పోటీల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లతో పాటు నూతనంగా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. స్టేడియంలో సాధన చేస్తున్న కబడ్డీ క్రీడాకారులతో మాట్లాడి వారికి కల్పిస్తున్న వసతులు, అవసరాల గురించి ఆరా తీశారు.
ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ బాధ్యతను తెలంగాణ రాష్ట్రానికి అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడు ఎడిషన్ల కంటే ఎనిమిదో ఎడిషన్‌ను అత్యంత ఘనంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి తెలంగాణ సత్తాను దేశానికి చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. తొలిసారిగా ఖేలో ఇండియా క్రీడల మస్కట్, లోగోను ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
ఖేలో ఇండియా క్రీడల నిర్వహణలో ప్రతి అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుతం స్టేడియంలో చేపడుతున్న నిర్మాణాలు కేవలం ఖేలో ఇండియా క్రీడల కోసమే కాకుండా, భవిష్యత్తులోనూ క్రీడాకారులకు ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 203 కోట్లను కేటాయించిందని, ఈ నిధులను పోటీల నిర్వహణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో జరిగే కబడ్డీ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పతకం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. క్రీడాకారులు పట్టుదలతో సాధన చేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.

