కలం, స్పోర్ట్స్: భారత అథ్లెటిక్స్‌లో కీలక మార్పులు జరిగాయి. జాతీయ చీఫ్ కోచ్‌గా అనుభవజ్ఞుడైన త్రో ఈవెంట్స్ కోచ్ పర్వీర్ సింగ్ (Parveer Singh) నియమితులయ్యారు. జూనియర్ అథ్లెట్ల అభివృద్ధి బాధ్యతలను స్ప్రింట్ కోచ్ రాజ్ మోహన్‌కు అప్పగించారు. ఈ విషయాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) సోమవారం ప్రకటించింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన పర్వీర్ సింగ్‌కు కోచింగ్‌లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ఆయన డిప్యూటీ చీఫ్ కోచ్‌గా పనిచేశారు. సీమా పునియా, కృష్ణ పునియా, తజిందర్‌పాల్ సింగ్ తూర్, అన్ను రాణి వంటి ప్రముఖ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చారు. 2020 నుంచి 2026 వరకు చీఫ్ కోచ్‌గా ఉన్న రాధాకృష్ణన్ నాయర్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు భారత అథ్లెట్లను సిద్ధం చేయడం పర్వీర్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఈవెంట్ల వారీగా కోచింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. ప్రతిభావంతులైన అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, పోటీల్లో పాల్గొనే అవకాశాలు కల్పించనున్నారు. 2027 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను ఒలింపిక్స్‌కు ముందు అథ్లెట్ల ప్రదర్శనను అంచనా వేసే వేదికగా ఉపయోగించుకోనున్నారు.
మరోవైపు, రాజ్ మోహన్ 2017 నుంచి భారత 400 మీటర్ల జట్టుకు శిక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల 4×400 మీటర్ల రిలే జట్టుతోనూ ఆయన పనిచేశారు. జూనియర్ స్థాయి నుంచే అథ్లెట్లను తీర్చిదిద్దడం తన ప్రధాన లక్ష్యమని రాజ్ మోహన్ తెలిపారు. ఎక్కువ మంది యువ అథ్లెట్లు భవిష్యత్తులో సీనియర్ జట్టుకు చేరేలా శిక్షణ కార్యక్రమాలను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.

