బాల్య వివాహాలను నిర్మూలించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా

కలం, జోగులాంబ‌ గద్వాల: చిన్న వయసులోనే వివాహాలు చేయడం వలన మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, బాల్యవివాహాల (Child Marriages) రహిత జిల్లాగా జోగులాంబ గద్వాలను ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) అన్నారు. ఐడీఓసీ సమావేశపు మందిరంలో సోమవారం బాల్య వివాహ ముక్త భారత్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య, వైద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్, ధరూర్ మండలాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నందున అక్కడ ప్రతి గ్రామంలో సర్పంచ్, ఇతర అధికారులను ఆహ్వానించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

బాల్య వివాహాల నిర్మూలనకు గట్టు మండలంలో ప్రత్యేకంగా ఒక సమన్వయకర్తను కూడా నియమించామన్నారు. అన్ని విద్యాసంస్థల్లో, గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనపై వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 30న బాల్యవివాహాల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా రథయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్నేహ కమిటీల ద్వారా కిశోర బాలికలు బాల్య వివాహాల నిర్మూలనకు తమవంతుగా కృషి చేయాలన్నారు. ఎక్కడైనా సరే బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ముందుగా సమాచారం ఆయా గ్రామస్తులకే తెలుస్తుందని, సామాజిక బాధ్యతగా ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే చిన్నపిల్లల జీవితాలను కాపాడవచ్చన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా తమ వద్ద చదువుతున్న పిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే అప్రమత్తమై నిర్మూలనకు సహకరించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహకులు బాల్యవివాహాల నిర్మూలనలో ప్రధాన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీడబ్ల్యూఓ సునంద, డీసీపీవో నరసింహ, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి చిన్నమ్మ థామస్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>