కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని చంద్రపూర్ (Chandrapur Earthquake) జిల్లాలో సోమవారం ( నవంబర్ 16) సాయంత్రం స్వల్ప భూకంపం సంభవించింది. జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వివరాల ప్రకారం.. సాయంత్రం 4:14 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూమి కంపించింది. బల్లార్పూర్–రాజురా ప్రాంత సమీపంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత సుమారు గంటన్నర వ్యవధిలోనే సాయంత్రం 5:30 గంటలకు 2.8 తీవ్రతతో మరోసారి స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి.
బల్లార్పూర్, రాజురా, విసాపూర్, దేవాడ, ఘుగ్ఘుస్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరోవైపు ఒకే రోజు రెండుసార్లు భూప్రకంపనలు రావడంతో అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ భూకంపం వస్తుందా? వస్తే ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ప్రకంపనలు వచ్చే అవకాశాలపై పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

