కలం, స్పోర్ట్స్: బెల్జియం స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు రొమెలు లుకాకు (Romelu Lukaku) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశం తరఫున 16 సంవత్సరాల పాటు అద్భుతమైన ప్రయాణం సాగించిన ఆయన, తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బెల్జియం తరఫున మొత్తం 135 మ్యాచ్‌లు ఆడిన లుకాకు, 94 గోల్స్ సాధించి దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. తన 16 ఏళ్ల కెరీర్లో ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కొన్నానని, అద్భుతమైన సహచరులు, కోచ్‌లతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని ఆయన పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, అలాగే అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నాలుగు ప్రపంచ కప్‌లు, మూడు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయంతో ప్రశాంతంగా ఉన్నానని, ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగిందని ఆయన వెల్లడించారు. లుకాకు సేవలను బెల్జియం ఫుట్‌బాల్ అసోసియేషన్ కొనియాడింది. నాయకత్వ లక్షణాలు, అంకితభావంతో బెల్జియం ఫుట్‌బాల్ చరిత్రలో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించింది. చిన్న వయసులోనే అరంగేట్రం చేసి అత్యున్నత స్థాయికి ఎదిగిన లుకాకు ప్రయాణం రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొంది.

