సత్తుపల్లికి గోదావరి జలాలు.. తుమ్మల కీలక హామీ

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupalli) నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, రాబోయే సంక్రాంతి నాటికి వేశ్యాకాంతల చెరువుకు గోదావరి జలాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) ప్రకటించారు. ఖమ్మం తరహాలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. సోమవారం సత్తుపల్లి మార్కెట్ యార్డులో రూ.10.80 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం చల్లగుల్ల నరసింహారావు చైర్మన్‌గా సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. గత 45 ఏళ్లుగా సత్తుపల్లి ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తున్నానని గుర్తుచేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి నీళ్లు అందిస్తున్నామని, ఎన్జీటీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. వచ్చే మే నెలకల్లా మరిన్ని ప్రాంతాలకు గోదావరి జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కల్లూరుగూడెం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో ఈ ప్రాంతంలో 3 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతోందని, మరో 3 వేల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వస్తున్నారని చెప్పారు. పామాయిల్‌తో పాటు కోకో, మిరియాలు వంటి ఉద్యాన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. విమానాశ్రయం, భద్రాద్రికి రైల్వే లైన్, కోవూరు-కొండపల్లి రహదారుల అభివృద్ధితో ప్రాంత రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందని, అందులో భాగంగానే చల్లగుల్ల నరసింహారావుకు మార్కెట్ కమిటీ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి, సత్తుపల్లి నియోజకవర్గంలో 4,700 మందికి ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత, చేనేత కార్మికుల పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో 3,500 ఇళ్లు ఇచ్చామని, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. తదుపరి విడతల్లో అర్హులందరికీ ఇళ్లు అందిస్తామని చెప్పారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్, ఉప సంచాలకులు వి. పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఆర్. సంతోష్ కుమార్, సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా బేగం, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>