కలం, నల్గొండ: రైతాంగ, వ్యవసాయ కార్మిక, భూమిలేని పేదలు, ఆదివాసీ సంఘాల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలమని రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్ (Rakesh Tikait ) అన్నారు. నల్గొండలోని జిఎం పంక్షన్ హల్ లో సారంపల్లి మల్లారెడ్డి నగర్లో ఏర్పాటు చేసిన అచ్చుతానందం హాల్లో సోమవారం నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దేశ రాజధాని ఢిల్లీని 13 నెలల పాటు దిగ్బంధించి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయించిన రైతాంగ పోరాటం ఐక్యతకు నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని, వాటిని దేశవ్యాప్త పోరాటాలుగా విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా, మహిళా సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం, తెలంగాణలోని వామపక్ష ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
600 రైతు సంఘాల ఐక్యతతో విజయం
దేశంలో రైతాంగ ఉద్యమాలకు సుదీర్ఘ చరిత్ర ఉందని, స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు రైతులు అనేక పోరాటాలు సాగిస్తున్నారని రాకేష్ టికాయత్ గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్ తదితర ప్రాంతాల్లో రైతులు, ఆదివాసీలు సాగిస్తున్న పోరాటాలు గ్రామీణ ప్రజల సమస్యల నుంచి పుట్టుకొచ్చినవేనన్నారు. ఢిల్లీలో మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని చెప్పారు. 600 రైతు సంఘాలను సంయుక్త కిసాన్ మోర్చా వేదికపైకి తీసుకురావడం చారిత్రక పరిణామమన్నారు. ఈ ఉద్యమంలో రైతులతోపాటు వ్యవసాయ కార్మికులు, భూమిలేని పేదలు, ఆదివాసీలు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు. పంజాబ్ రైతాంగం ప్రత్యేక చొరవతో ఉద్యమానికి నాయకత్వం వహించగా, హర్యానాతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చారని వివరించారు. 13 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరంతర పోరాటం సాగించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించారని పేర్కొన్నారు.
నవంబర్ 26న రాత్రి బస.. 27న చక్కాజామ్
రైతాంగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని, పరిస్థితులు, ప్రాంతీయ సంభావ్యతను బట్టి మండల స్థాయిలోనూ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోనూ పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించే అంశాన్ని సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో చర్చిస్తామన్నారు. నవంబర్ 26న రాత్రి ఆందోళన స్థలాల్లోనే బస చేసి నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని, నవంబర్ 27న ఉదయం చక్కాజామ్ నిర్వహించాలని సూచించారు. గతంలో ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా అనుసరించిన పోరాట పద్ధతులను మరోసారి కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీలు తమ హక్కుల కోసం రాత్రంతా ధర్నాలు నిర్వహిస్తున్న తరహాలో రైతాంగ ఉద్యమాల్లోనూ నిరంతర నిరసన కార్యక్రమాలను భాగం చేయాలని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రైతాంగ పోరాట యోధులకు నివాళి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రస్తావిస్తూ నిజాం పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు పోరాడిన త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. సుమారు నాలుగు వేల మంది రైతులు పాల్గొన్న పోరాటంలో ఎందరో నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వాసుదేవ్, నేలాల్, గల్లు సౌరాజ్యం, సి. రాజేశ్వరరావు తదితర పోరాట యోధుల సేవలను గుర్తుచేస్తూ, తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేర్లను చరిత్రలో నిలపాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లోనూ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైతాంగ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అంటే ప్రజా ఉద్యమాలను, విప్లవాత్మక భావజాలాన్ని బలోపేతం చేయడమేనన్నారు. మహాసభల నిర్వహణకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జై హింద్, జై భారత్ నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు.

