కలం, నిర్మల్ : ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం (Prajavani Programme) అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హాజరుకాకపోవడంతో సమావేశ మందిరంలోని కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, వెంకట మాధవరావు, డీఆర్ఓ రాథోడ్ రమేష్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
అయితే కలెక్టర్ ప్రజావాణికి రాకపోవడంతో జిల్లా స్థాయి అధికారులు ఒక్కొక్కరుగా సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రజల సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ఫిర్యాదుదారుల మధ్య అధికారులు లేక సమావేశ మందిరం బోసిపోయింది. కొందరు అధికారులు తమ పనుల్లో నిమగ్నమవగా, మరికొందరు మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ కనిపించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాల్సిన ప్రజావాణిలో జిల్లా స్థాయి అధికారులంతా అందుబాటులో ఉండకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

