శాతవాహన వర్సిటీ పరిరక్షణకు విద్యార్థి సంఘాల పోరు

కలం, కరీంనగర్ బ్యూరో: శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) పరిరక్షణ, అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (BSF) రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం శాతవాహన యూనివర్సిటీ గేటు ముందు అఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. ప్రకృతి సిద్ధమైన ఆహ్లాదకర వాతావరణం కలిగిన శాతవాహన యూనివర్సిటీలోని మహావృక్షాలను పెకిలించి వేస్తున్నారని, కొన్ని మీటర్ల లోతు వరకు తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాల్సిన వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ శాతవాహన యూనివర్సిటీ విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసు పహారాలో విద్యార్థులకు తరగతులు నిర్వహించడం యూనివర్సిటీ అధికారుల నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు.

యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో మిగిలిపోయిన పీజీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీంతో సీట్లన్నీ ఖాళీగా మిగిలిపోయే అవకాశం ఉందని, అర్హత కలిగిన విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

యూనివర్సిటీ విధ్వంసానికి పాల్పడుతున్న వైస్ ఛాన్సలర్, అందుకు సహకరిస్తున్న అధికారులపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌యూ జేఏసీ చైర్మన్ కరికె మహేష్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్, ఎస్‌ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాంపల్లి అరవింద్, ఎస్‌యూ అధ్యక్షుడు కేశవ్, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ శివాజీ, ఎస్‌ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు ఓంప్రకాష్, సాయి కిరణ్, లక్ష్మణ్ సాయి, రోహిత్, శ్రవణ్, రాకేష్, ఎస్‌యూ ఉపాధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>