కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆదేశించారు. ఈ ప్రక్రియలో భూ యజమానుల ప్రయోజనాలు, వారి అభిప్రాయాలు, మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూ సర్వే పురోగతిపై మంగళవారం సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. అందులో తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,000 గ్రామాల్లో రీసర్వే మైలురాయిని దాటగా, 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.
గ్రామాల్లో భూ సర్వే ప్రారంభించడానికి ముందుగా ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, భూముల విస్తీర్ణం, హక్కులు, సరిహద్దులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను ప్రారంభించాలన్నారు.
సర్వే అనంతరం భూ యజమానులకు నోటీసులు జారీ చేసి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించాలని చెప్పారు. రైతులకు సర్వే ప్రక్రియ, అభ్యంతరాల నమోదు, పరిష్కారంపై విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. తరతరాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

