కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో(ACB Bribe Trap) భైంసా ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్‌కు రూ.2.63 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లు మంజూరు చేసేందుకు కమిషనర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేల లంచం తీసుకుని కారులో బయలుదేరిన కమిషనర్‌ను సుమారు రెండు కిలోమీటర్ల మేర వెంబడించారు. చివరకు శాంతినగర్ చౌరస్తాలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సమీపంలో కారును అడ్డగించి పట్టుకున్నారు. కారులో ఉన్న లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దివ్యనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. జాదవ్ సంతోష్‌ను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ మధు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కోసం 9154388963, టోల్‌ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ హెల్ప్‌లైన్ 9440446106ను సంప్రదించాలని కోరారు.

