కలం, అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లా అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ వన రక్షక్ సేవా సమితి అచ్చంపేట ఆధ్వర్యంలో మంగళవారం ప్రమాద బీమా (Accident Insurance) సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ బీమా పథకం కింద ఉద్యోగికి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే వారి నామినీకి రూ.10 లక్షల బీమా పరిహారం అందిస్తారని తెలిపారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు గాయాలై వైద్య చికిత్స అవసరమైన సందర్భంలో రూ.3 లక్షల వరకు వైద్య ఖర్చుల బీమా సౌకర్యం కల్పించినట్లు వివరించారు.
అటవీ శాఖలో నిరంతరం విధులు నిర్వహిస్తూ అంకితభావంతో సేవలందిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రతకు, వారి కుటుంబాల సంక్షేమానికి వన రక్షక్ సేవా సమితి తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, ఐఎఫ్ఎస్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్, అచ్చంపేట, మేనేజర్ సలీం పాల్గొన్నారు. “ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం.. వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే మా బాధ్యత” అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వన రక్షక్ సేవా సమితి అచ్చంపేట ప్రతినిధులు తెలిపారు.

