కలం, కరీంనగర్: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ సి. పార్థసారథి (Parthasarathi) అన్నారు. ఉపాధ్యాయుల మేధస్సుకు ఏఐ తోడైతే బోధన మరింత ప్రభావవంతంగా మారుతుందని పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బెటర్ లెర్నింగ్’ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని 98 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 330 మంది గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ఏఐని సమర్థవంతంగా వినియోగించుకుంటే విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా పాఠ్యాంశాలను బోధించవచ్చన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ బోధనా పద్ధతుల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐని ఉపాధ్యాయులకు సహాయక సాధనంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై అవగాహన కల్పించాలంటే ఉపాధ్యాయులు ఏఐపై పూర్తి స్థాయి పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పారు. మంచి బోధనా పద్ధతులను నేర్చుకుని, వాటిని ఏఐతో అనుసంధానించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చన్నారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై ఉపాధ్యాయులకు ఆయన స్వయంగా అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పార్థసారథి గుర్తు చేసుకున్నారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జిల్లా అభివృద్ధితో పాటు విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు.
విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఏఐ పరిచయం..
కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా తమ బోధనా పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. రోజువారీ విధులను ఏఐ ద్వారా సులభతరం చేసుకునే మార్గాలను అన్వేషించాల న్నారు. ప్రభుత్వం ఏఐకి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఈ సాంకేతికతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఏఐపై శిక్షణ పొందిన టీచర్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై విస్తృతంగా అవగాహన పెంపొందించాలన్నారు. పదవ తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిజ్ఞానం మరింతగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. వర్క్ షాప్ నిర్వాహనకు కృషి చేసిన పార్థసారధి గారికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఇన్చార్జి తిరుపతిరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, ఆర్డీవో షర్మిల, ఇంచార్జ్ డీఈఓ తిరుపతిరావు, ఎస్సీఈఆర్టీ రిసోర్స్ పర్సన్ లక్ష్మీనాథం, విద్యాశాఖ కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, నంది శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

