కలం, గుడిహత్నూర్ : దీపావళి పండుగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సెలవుపై స్వగ్రామానికి వచ్చిన బీఎస్‌ఎఫ్ జవాన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. గుడిహత్నూర్ (Gudihathnoor Accident) మండలం సీతగొంది సమీపంలోని 44 జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జామిడి గ్రామానికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ జాదవ్ సాయి (28) ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. దీపావళి పండుగకు బట్టలు కొనుగోలు చేసేందుకు తన స్నేహితుడు ఓంకార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్‌కు బయలుదేరాడు. సీతగొంది సమీపంలో రహదారి మరమ్మతులు జరుగుతున్న ప్రాంతం వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, ఓంకార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గాయపడిన ఓంకార్‌ను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గుడిహత్నూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువ జవాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో జామిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

