వరికి ప్రత్యామ్నాయంగా మునగ సాగు..!

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) వ్యవసాయ రంగంలో పంటల సాగు పద్ధతులు మారాల్సిన సమయం ఆసన్నమైందా? ఎల్‌నినో ప్రభావం, నీటి లభ్యతపై అనిశ్చితి, పెరుగుతున్న సాగు ఖర్చుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మునగ సాగును (Drumstick Cultivation) లాభదాయకమైన ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడం చర్చనీయాంశంగా మారింది. భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన రైతు మహేందర్ రావు 15 ఎకరాల్లో చేపట్టిన మునగ సాగు ఇప్పుడు అధికారుల దృష్టిని ఆకర్షించింది. బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్వయంగా రైతు తోటను సందర్శించి సాగు విధానం, దిగుబడి, పెట్టుబడి, మార్కెటింగ్ అవకాశాలను పరిశీలించారు. రైతు వెల్లడించిన లెక్కల ప్రకారం ఎకరాకు మూడు సంవత్సరాల్లో 6,600 కిలోల ఎండిన మునగ ఆకుల దిగుబడి వస్తుందని, ప్రస్తుత మార్కెట్ ధర కిలోకు రూ.100 చొప్పున లెక్కిస్తే రూ.6.60 లక్షల వరకు స్థూల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

సాగు సమస్య కాదు.. మార్కెట్ ఎక్కడ?

మునగ సాగుపై రైతుల్లో ఆసక్తి పెరగాలంటే దిగుబడి ఒక్కటే సరిపోదు. పండించిన పంటను ఎవరు కొనుగోలు చేస్తారు? ఎంత ధర చెల్లిస్తారు? నిరంతర కొనుగోలు ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం అవసరం. ఈ అంశాన్నే రైతు మహేందర్ రావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ టాటా, యూనికార్న్, బొటానికా సంస్థల ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడి కొనుగోలు అవకాశాలపై చర్చించారు. సంస్థలు సానుకూల ఆసక్తి చూపడం ఈ పంటకు మార్కెటింగ్ అవకాశాలపై కొత్త ఆశలు కలిగిస్తోంది.

ప్రభుత్వం అండ.. రైతులకు ప్రోత్సాహం

VB-G RAM G పథకం కింద మునగ సాగుకు అవసరమైన గుంతల తవ్వకం, మొక్కల సరఫరా వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రభుత్వ సబ్సిడీతో అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రైతులకు ముందున్న అసలైన పరీక్ష

మునగ సాగు విజయవంతం కావాలంటే సంస్థల ఆసక్తి కొనుగోలు ఒప్పందాలుగా మారాలి. ప్రకటించిన ధరలకు నిరంతర కొనుగోలు, నాణ్యత ప్రమాణాలు, రవాణా, నిల్వ సదుపాయాలపై స్పష్టత రావాలి. అప్పుడే ఈ సాగు మరిన్ని గ్రామాలకు విస్తరించే అవకాశం ఉంటుంది. బొల్లేపల్లిలో ప్రారంభమైన ఈ ప్రయత్నం జిల్లావ్యాప్తంగా రైతులకు కొత్త ఆదాయ మార్గంగా మారుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>