స్కూళ్ల‌లో వంద‌ శాతం స్క్రీనింగ్ పూర్తి చేయాలి: డీఈఓ బిక్షపతి

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో దివ్యాంగ విద్యార్థుల గుర్తింపుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరినీ గుర్తించి 100 శాతం స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం బిక్షపతి (Bollaram Bikshapathi) స్పష్టం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత్యేక అవసరాలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించకుండా సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. బుధవారం రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశస్త్ (PRASHAST) యాప్ వినియోగంపై మండల రిసోర్స్ పర్సన్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ యూడైస్ సంఖ్య కలిగిన అన్ని విద్యాసంస్థల్లో 3 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయకుండా ప్రైవేటు విద్యాసంస్థలు కూడా పూర్తి బాధ్యతతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగ విద్యార్థులను ముందుగానే గుర్తించడం ద్వారా వారికి అవసరమైన విద్యా సహాయం, ప్రత్యేక సదుపాయాలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గురువారం నవంబర్ 5న మండల స్థాయిలో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త పెసరు లింగారెడ్డి, జిల్లా రిసోర్స్ పర్సన్లు డాక్టర్ జి. శివరాజు, రామచంద్రు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, ఐఆర్‌పీలు, మండల రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>