కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర విషాదకర పరిస్థితి నెలకొంది. బేతుపల్లి చెరువు (Bethupally Cheruvu) ఉద్ధృతికి చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారుల్లో నలుగురిని కాపాడిన అనంతరం, మిగిలిన ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే, నీటి ప్రవాహం అదుపులేకుండా పెరగడంతో వారు ప్రయాణిస్తున్న రెండు రెస్క్యూ బోట్లు ప్రమాదవశాత్తు బోల్తా పడి, 10 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. నీటి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది. ప్రస్తుతం మరొక బోటు సాయంతో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , జిల్లా కలెక్టర్ దివాకర్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, సత్తుపల్లి పట్టణం చుట్టూ వరద నీరు భారీగా వచ్చి చేరడంతో పాటు తమ్మిలేరు వాగు పోటెత్తి ప్రమాదపు అంచున ప్రవహిస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోగా, వరద ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

