కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు (Telangana Drought) పరిస్థితులు సర్కార్‌కు సంకటంగా మారాయి. ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోలేకపోతున్నది. కరువు సాయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం.. కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపడంపైనా సమాచారం ఇవ్వకపోవడం.. మరోవైపు రైతులను ఆదుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం దీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నది. రాష్ట్రంలో 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి, కేంద్రానికి నివేదిక పంపి పది రోజులైనా అక్కడి నుంచి స్పందన కరువైంది.
కేంద్రం నుంచి అధ్యయన బృందాలు ఎప్పుడొస్తాయో తెలియదు? ఎంత సాయం అందుతుందో తెలియదు? నివేదికలోని రాష్ట్ర విజ్ఞప్తులపై కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియదు.. ఇలాంటి సందేహాల నడుమ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వాలనేది రాష్ట్ర సర్కార్‌కు పరీక్షగా మారింది. కరువుపై విధాన నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించినా.. కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారే తప్ప.. కరువు అంశంపై మాత్రం మౌనం వహించారు. రైతాంగాన్ని ఆదుకోవడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
స్పందించని కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత కరువు నెలకొన్నది. ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాల వర్షపాతం గణనీయంగా తగ్గిందని, 365 మండలాల్లో కరువు నెలకొన్నదని, ఇందులో 111 మండలాల్లో తీవ్ర స్థాయిలో ఉన్నదని.. కేంద్రానికి పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. కరువుపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేల్కొన్నదని, సెప్టెంబర్ 18న అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేశామని అందులో గుర్తుచేసింది. వెంటనే సెంట్రల్ టీమ్‌లను పంపి రాష్ట్రంలోని కరువుపై అధ్యయనం చేయాలని కోరింది.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎస్డీఆర్ఎఫ్) నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నిధులను పంట నష్టానికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, తాగునీటి అవసరాలకు ఏర్పాట్లు, పశుగ్రాసాన్ని సమకూర్చుకోవడం, భూగర్భ జలమట్టాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలకు వినియోగించనున్నట్లు వివరించింది. జీ-రామ్-జీ స్కీమ్ కింద అదనంగా మరో 50 రోజుల పని దినాలను కల్పించాలని, అదనంగా ఎరువులు సప్లై చేయాలని కోరింది. కానీ వీటికి కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది.
రాజకీయాలకే పరిమితమైన అమిత్ షా
హైదరాబాద్‌లో సోమవారం పాదయాత్ర నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రంలోని కరువు గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమై ప్రసంగించి వెళ్లిపోయారు. రాష్ట్రంలోని కరువు, ఎన్డీఆర్ఎఫ్ సాయం తదితరాలన్నీ ఆయన మంత్రిత్వశాఖ పరిధిలోని అంశాలైనా వాటి గురించి మాట్లాడకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించి, అవినీతి గురించి ఘాటుగా రియాక్ట్ అయిన అమిత్ షా.. కరువు అధ్యయన బృందాలను పంపడంపై, కేంద్రం నుంచి సాయం అందించడంపై మాత్రం మౌనం వహించడం రాష్ట్ర అధికారులను విస్మయానికి గురిచేసింది.
ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) పరిధిలోకి రాకుండా అదనంగా 0.5% శాతం మేర (రాష్ట్ర జీఎస్డీపీలో 3 శాతానికి బదులుగా 3.5% తీసుకునేలా) అదనపు రుణాన్ని కూడా తీసుకునేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. రాష్ట్రంలోని విద్యుత్ డిమాండ్‌ను గమనంలోకి తీసుకుని అదనంగా 1,500 మెగావాట్లను సమకూర్చాలని కూడా విజ్ఞప్తి చేసింది. వీటిపైనా అమిత్ షా నుంచి ఎలాంటి హామీ లభించలేదు.
రాష్ట్ర సర్కార్‌కు సవాల్
రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్పందిస్తూ.. “ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..” అంటూ దుమ్మెత్తి పోస్తున్నది. రైతులకు సాయం చేయడంలో రాష్ట్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నదని విమర్శిస్తున్నది. రైతు సభల పేరుతో జిల్లాల్లో పబ్లిక్ క్యాంపెయిన్ చేపట్టింది. వీటికి తోడు నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి, రెండు రోజుల పాటు మంత్రులు ఢిల్లీలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో..’ క్యాంపెయిన్‌లో నిమగ్నం కావడంతో రాష్ట్రాన్ని, ప్రజలను గాలికి వదిలేశారన్న విమర్శలను బీఆర్ఎస్ ఉధృతం చేసింది.
రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదంటూ నిందిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేక, బీఆర్ఎస్ విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వలేక, రాష్ట్ర రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోలేక సర్కార్ సంకటంలో పడింది. ఈ పరిస్థితి వచ్చే సంవత్సరం జులై వరకు కొనసాగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉంటుందన్నదని కీలకంగా మారింది. ఏక కాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాన్ని ఢీకొట్టడం తక్షణ టాస్క్‌గా మారింది.

