కరువు మండలాల్లో పంట నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ

కలం, హనుమకొండ: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నందున రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని సీపీఐ (CPI) రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు (Takkallapalli Srinivasa Rao) డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, హసన్‌పర్తి మండలాల్లో కరువు ప్రభావిత గ్రామాలు, ఎండిపోతున్న పంటలను సీపీఐ నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 375కుపైగా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, 20 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పొట్ట దశలో ఉన్న వరి పంట ఎండిపోతోందన్నారు. వరికి ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మిర్చికి రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.

అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్రానికి కరువు నివేదిక పంపాలని, పంటలను కాపాడేందుకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలని, కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక నిధులు కేటాయించి, ఉపాధి కోల్పోయిన కార్మికులకు అదనపు పని దినాలు కల్పించాలని, రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నేదునూరి జ్యోతి, ఆదరి శ్రీనివాస్, మారుపాక అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>