కలం, కరీంనగర్ బ్యూరో: బీసీల హక్కుల సాధన కోసం గ్రామస్థాయి నుంచి సంఘ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. చట్టసభల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ‘బీసీల మహాసభ’ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తారక హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరుష హనుమాన్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
గ్రామ స్థాయి నుంచి కమిటీలు..
బీసీ ఉద్యమం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి విస్తరించాలని బీసీ సంఘం నేతలు అన్నారు. ప్రతీ గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం కమిటీలను ఏర్పాటు చేసి, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పటిష్టమైన కార్యవర్గాలను నిర్మించి, బీసీ కులాలన్నీ ఐక్యంగా హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
జాతి జనగణనలో ఓబీసీ కాలమ్..
దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో అధికారికంగా తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని వారు ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణనలో బీసీ (ఓబీసీ) కాలమ్‌ను చేర్చి సమగ్ర బీసీ కులగణన చేపట్టాలన్నారు. ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించి, జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో “మేమెంతో… మాకంత వాటా” దక్కేలా చూడాలని కోరారు.
ఈనెల 26న మహాసభ..
దశాబ్దాలుగా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీ కులాలకు పాలక వ్యవస్థల్లో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని బీసీ నేతలు అన్నారు. ఇకపై బీసీలు తమ హక్కుల కోసం సంఘటిత శక్తిగా పోరాడక తప్పదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించేందుకు ఈనెల 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ‘బీసీల మహాసభ’ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సభను విజయవంతం చేయడానికి బీసీలందరూ తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల సీనియర్ నాయకులు ఎన్నం ప్రకాష్, రంగు సంపత్ గౌడ్, పరుశరాములు, రాచమల్ల రాజు, దొగ్గిలి శ్రీధర్, నారోజు రాకేష్ చారి, సంజీవు, ఐల్ల ప్రసన్న, సంతోషిని, సురేంధర్ బ్రహ్మచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కమిటీ అధ్యక్షులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

