కలం, ముధోల్: ముధోల్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో (CHC) వైద్య సేవలను మరింత మెరుగుపరిచి, రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) తెలిపారు. మంగళవారం ముధోల్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (Mudhole Hospital) సందర్శించి, ఆసుపత్రిలోని వివిధ విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది సంఖ్య, ప్రతిరోజూ చికిత్స కోసం వస్తున్న రోగుల వివరాలు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రక్త పరీక్షల గది, మందుల పంపిణీ కేంద్రం తదితర విభాగాలను పరిశీలించి, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రి భవనం పాతదైనందున అవసరమైన మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రి(Mudhole Hospital)లో మార్చురీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులతో సంప్రదించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఈ తనిఖీలో డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, తహసీల్దార్ శ్రీలత, సర్పంచ్ షబానా బేగం, వైద్యులు పాల్గొన్నారు.
Also Read : తుమ్మిడిహెట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ సమీక్ష
Follow Us On: X(Twitter)

