కలం, స్పోర్ట్స్: దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo)ఆట తీరు పడిపోయిందని మాంచెస్టర్ యునైటెడ్ మాజీ మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ వ్యాఖ్యానించారు. రోనాల్డో ప్రదర్శన క్షీణించడం యువెంటస్ క్లబ్లో ఉన్నప్పటి నుంచే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టెన్ హాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోనాల్డో గత ఎనిమిదేళ్లుగా అత్యున్నత స్థాయిలో నిలకడగా రాణించలేకపోతున్నారని చెప్పారు. ప్రీమియర్ లీగ్‌లో రాణించడానికి అవసరమైన శారీరక శ్రమను ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా లేరని విమర్శించారు. రోనాల్డో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరే అయినప్పటికీ, ఏ ఒక్క ఆటగాడూ క్లబ్ కంటే ఎక్కువ కాదని స్పష్టం చేశారు.
రియల్ మాడ్రిడ్ క్లబ్ ఆటగాళ్ల ఫామ్ తగ్గకముందే సరైన సమయంలో విడిచిపెడుతుందని, కానీ మాంచెస్టర్ యునైటెడ్ ఆ విషయంలో అలా చేయలేకపోయిందని ఎరిక్ పేర్కొన్నారు.మాంచెస్టర్ యునైటెడ్‌లో ఉన్న సమయంలో 2022-23 సీజన్లో తోటెన్ హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చేందుకు రోనాల్డో నిరాకరించారు. ఆ తర్వాత టీవీ ఇంటర్వ్యూలో క్లబ్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో 2022 నవంబర్‌లో రోనాల్డో కాంట్రాక్ట్‌ను యునైటెడ్ రద్దు చేసింది.ప్రస్తుతం ఎఫ్‌సి ట్వెంటే టెక్నికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న టెన్ హాగ్ చేసిన వ్యాఖ్యలు ఫుట్‌బాల్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

