కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 109 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి తో పాటు, సీ.ఎం ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు వారి వినతులపై చేపట్టిన చర్యల గురించి సహేతుక వివరణలతో లిఖిత పూర్వకంగా సమాచారం తెలియజేయాలని, వివరాలను వెంటవెంట ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

